Friday, March 30, 2012
తాడు బొంగరం
2-1-2011 ఆదివారం ఆంధ్రప్రభలో నేను రాసిన సమీక్షా వ్యాసం బ్లాగులో మరొక్కసారి!
దైనందిన జీవితంలో తారసపడే ఎన్నో హాస్య సంఘటనలను అప్పటికప్పుడు నవ్వుకుని మరచిపోతాం.తాడూ-బొంగరం సంపుటంలో అక్షరబద్ధమైన హాస్యరచనలు మరీమరీ చదివి నవ్వుకునేలా ఉన్నాయి.సహజత్వం వీటి స్థాయిని పెంచేందుకు దోహదపడింది. సామెతలు;కోతలు, కట్టుకథలు,డాంబికాలు ఇవన్నీ నిత్యప్రయోగాలే.వీటిని వాడినతీరు,వాడిన సందర్భం,అందలి హాస్యాంశం పాఠకులకు కితకితలు పెట్తుంది.
తెలుగు ప్రపంచసభలవలె తెలుగు పంచామృతసభలు జరపాలంటూ గోంగూర పచ్చడి,ఆవకాయ,కందిపొడి,వడియాలు,అప్పడాలువంటి తెలుగు రుచులను ఆస్వాదించే వైనాన్ని హాస్యస్ఫోరకంగా రచించారు పులిగడ్డ విశ్వనాథరావుగారు.వొట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్టవోయ్ అన్నారు గురజాడ.కాని నేడు మైకందుకుని కేవలం వొట్టిమాటలుచెప్తూ మైకండేయులుగా పేరొందుతున్నారంటారు రచయిత.బ్రహ్మదేవుడు భరతఖండవాసులకు వరమిచ్చిన వాగ్బలముతో, వాక్ యుద్ధంచేసి గెలవగలిగినవారు భరతవాసులంటారు. సామాజిక యదార్థాలను,ఆలోచనలను సూటిగా వ్యక్తపరిచే సామెతలను అశ్రద్ధ చేయవద్దంటారు.సామెతలు,భాషకు కళాత్మకంగా నగిషీలు చెక్కుతాయనడం వాస్తవమే.మననిత్య జీవితంలో మమేకమైన సామెతలను ఉటంకిస్తూ ఓడిపోయినవారు కోర్టులో ఏడిస్తే,గెలిచినవాడు ఇంటికెళ్లి ఏడ్చాడట!అని చెప్పడం ఆ సామెతకున్న పదశక్తిని తెలుపుతోంది.
భావవ్యక్తీకరణలో సామెతల వినియోగం మరింత వ్యాపించాలని, ఇంకా ఎన్నో సామెతలు ఉద్భవించాలని ఆశిస్తున్నారు.కట్టుకథలు కూడా ఓవిధంగా కనికట్టు విద్యలే.కన్నుకట్టుకున్నట్లు ఇంద్రజాలంలో కనపడేదానిని నిజమనుకుంటాం. అదేవిధంగా మసిపూసి మారేడుకాయను చేసినట్లు పనిమనిషి,ఉద్యోగులు,భార్యాభర్తలు,పిల్లలు ఈ కట్టుకథలను ఆశ్రయిస్తారు.నిజాన్ని నిర్భయంగా చెప్పలేని అశక్తతే ఇటువంటి కట్టుకథలకు దారితీస్తుంది.బడి ఎగ్గొట్టడానికి లెక్కలమాస్టారును చంపేస్తారు కట్టుకథతో.ఇంట్లో ముసలివాళ్లను చంపేస్తారు,
ఒక్కసారికాదు,పదేపదే సెలవు కావాలన్నపుడల్లా.అప్పుడు కట్టుకథ గొలుసుకథవుతుంది.
దైవదర్శనం మొదలుకుని ఆసుపత్రిదాకా లంచందే పెద్దపీట.ఆఫీసుల్లో పనులు సానుకూలపడాలంటే ఫైలు థ్రూ ప్రాపర్ చానల్ లో రావాల్సిందే అని చెప్పిన ఫీచర్ నడుస్తున్నచరిత్రకు అద్దం పడుతోంది.వీరు రచించిన చక్కటి అంశం సొరకాయకోతలు.మధురవాణితో గిరీశం కోసిన కోతలతో మొదలవుతుంది ఈ ఫీచర్. రాజకీయాలు,వ్యాపారాలలో ప్రగల్భాలు పలకడం ఈ కోవలోకే వస్తుంది.
ఒకమాట విభిన్న మనషుల దగ్గరకు చేరేసరికి రూపాంతరం చెంది కడకు అసలు అర్థాన్నే పోగొట్టుకుంటుంది.ఇదే చెప్తుంది వక్రరిపోర్టింగ్.బిజినెస్ చేయాలంటే విక్రయ వాక్చాతుర్యం కావాలి. పై ఆఫీసరును పొగిడి ప్రమోషన్లు సాధించుకోవడం,మాటలు చెప్పి వస్తువులను అమ్మెయ్యడం సేల్స్ టాక్ లో పారదర్శకం చేసారు. ప్రసార సాధనాలుగాకాక ప్రచారసాధనాలుగా మారుతున్న వార్తలు అనడం ప్రకటనల హోరును తెలియచేస్తుంది.అలాగే జోస్యం చెప్పే కంప్యూటర్ గణాంకాలు,లౌక్యంగా చెప్పేవారి జోస్యం ఒకొక్కసారి లెక్క తప్పినపుడు వెలువడే హాస్యం చదివితీరవలసిన ప్రహసనమే!ఈ సంపుటంలో ప్రాణాంతకకవిత్వం,తారుమార్లు,మతిమరపు,సమయపాలన తదితర హాస్య ఫీచర్లెన్నో ఉన్నాయి.మానసిక వత్తిడికి హాస్యమేకదా మందు!చదివి హాయిగా నవ్వుకోవాల్సిన పుస్తకం.
Saturday, March 24, 2012
TELUGU PENSCAPE
Telugu penscape
Telugu story has completed hundred years in its journey.Many writers have contributed their services to present the stories at their best.The stories so written should reach one and all so that the diversified cultures are clearly understood by everyone. How? The answer is none other than translation from Telugu to different languages and vice versa. In this process Nidadavolu Malathy Garu has taken immense efforts and established ’ Thulika ‘ website and posted the stories in English translated from telugu.
She is wellknown in the blog world and also in the writer’s arena. Previously I have reviewed her anthology of short stories ‘Kathala Attayya Garu ’. I understood not only her love for stories but also her passion for discussions on telugu literature especially Katha sahithyam. Both the factors have helped her in emerging as a good writer.
Now the book Telugu Penscape added one more feather in her crown through the translation of short stories into English from Telugu. Her knowledge of both the languages and enthusiasim to present our culture and tradition through the translation has highlighted her profile. Her attempts to project the telugu culture to the readers who cannot read in telugu will be fulfilled if such translations pave way in the present scenario. No matter how comfortable she was while translating from telugu to English but it is the comfort of the reader that counts while reading the translation. After going through Penscape I enjoyed in the same way as I do while reading a story in Telugu. I sincerely feel that the readers who cannot read and enjoy the stories written in telugu will take the opportunity of reading this book.
I humbly request Malathy Garu to continue her endeavor in translation. Many writers have said Mahabharata is not translated from Sanskrit to Telugu but it is transcreated in Telugu. Such should be the concept of translation. I heartly congratulate the creator of Thulika website for the outcome.
Not but the least the efforts of Lekhini are well appreciated on publishing the book Penscape and a special mention to be made to the cover designed by sri Seela Veerraju garu which amply depicts the essence of the book.
Friday, March 23, 2012
ఉగాది శుభాకాంక్షలు
వసంతాగమనమదిగో కుహూరవాలు
మామిడిరుచుల ఆస్వాదనకు సవరించిన
ఎలకోయిల కంఠస్వర విన్యాసాలు
శ్రీఖరమునకిదే వీడ్కోలు కైమోడ్పు
కోటిఆశలపల్లకిపై అరుదెంచిన శ్రీనందన ఉగాదికి
శతాభినందనలు సహస్రాభివందనలు
గతించిన చేదు జ్ఞాపకాలకు తీయటిలేహ్యమై రమ్ము
నిరాశచెందిన బ్రతుకుల ఆశల చివురువై ప్రవేశించు
మనుషుల మనసుల మల్లెలు పూయించు
ధవళకాంతులు శాంతి కపోతాలుగ అలరించు
అవని పానుపున హరిత తివాచీయై
రైతన్నకు ఉలికిపాటులేని నిదురనివ్వు
నదుల దోసిట జలప్రదాయినివై
సర్వజనుల నిత్యచలివేంద్రమై భాసించు
శ్రీ నందన ఉగాదికిదె స్వాగత తోరణము
Tuesday, March 20, 2012
అమెరికా ఓ అమెరికా!
అమెరికా ఒక కలల ప్రపంచం.ఆ దేశ జీవనంతో మన జీవనశైలిని తూకమేసి చూపిన రచన అమెరికా ఓ అమెరికా!ఆచార్య మసన చెన్నప్ప గారి నానీల సంపుటిపై ఆంధ్రప్రభ 11-3-2012 దినపత్రికలో ప్రచురింపబడిన నా రచన.
మెరికల్లాంటి భావాల అమరిక-అమెరికా!ఓ అమెరికా!
మనసున ఉదయించిన భావాలను నానీలుగా మెరిపించడం ఆచార్య మసన చెన్నప్పగారి చతురతా పాటవమే! వీరు ఆవిష్కరింపచేసిన అమెరికా!ఓ అమెరికా!నానీల సంపుటి అమెరికా జీవన సరళిని మన జీవన శైలితో త్రాసులో వేసి తూకం చూడమంటుంది.ఇరువైపులా మొగ్గు చూపగలగడం ఈ త్రాసు ప్రత్యేకత!అక్కడ కొన్నిటికి అగ్రాసనమైతే,ఇక్కడ కొన్ని అగ్రతాంబూలమందుకుంటాయి.
నలుగురితో సుఖమా ఇండియాలో ఉండు,ఏకాంతవాసమా అమెరికాకు రా! అంటారు.ఒంటరితనానికి అక్కడ పెద్దపీట. కలసి జీవించడం మన మనసు మాట.ఆ దేశ ప్రభావం కొంత,ఉద్యోగవిధుల వల్ల మరికొంత ఇక్కడ కూడా సమిష్టి కుటుంబాల స్థానే వ్యష్టి కుటుంబాలు అధికమవుతున్నాయి.కుడివైపున వాహనాలు నడపడం వారి మార్గం! వారిని రైటిస్టులని చమత్కరిస్తారు. వైద్యపరమైన వనరులు,సదుపాయాలు అపారమక్కడ.అందుకే వైద్యులను అపర ధన్వంతరులన్నారు.అమెరికా ఘనత శుభ్రతలోనేనంటూ అచట క్రిములుండవు,ఐస్ క్రీములుంటాయంటారు.అక్కడ రోడ్ల శుభ్రతను కాంచిన కవి ఇక్కడ కార్లకు కొబ్బరికాయలు కొట్తే అక్కడ రహదారులకు కొబ్బరికాయలు కొట్టాలంటారు.కార్లు తప్ప మనుషులు కనబడని రహదారులంటారు వారివి.కార్లు,మనుషులే కాదు అన్ని రకాల వాహనాలు,కలసికట్టుగా సంచరించే మన రహదారులు అలాంటి అభివృద్ధి అందుకోవాలని ఆశపడతాం.
షికాగో నగరంలో వివేకం పురివిప్పి నాట్యమాడిందంటూ వివేకానందుని ప్రసంగాన్ని జ్ఞాపకాలతెర తీసి చూపుతారు. శని,ఆదివారాలు మాత్రమే వెసులుబాటు,మిగత ఐదురోజులు ఖైదీలే అంటారు.తూర్పు,పడమర ఎదురెదురు కదా,అందుకే వారు హిమాలయాలవైపు చూస్తే మనం నయాగరావైపు చూపు సారిస్తామన్న కవి పలుకులు అక్షరసత్యాలు.వెలగలిగిన వస్తువుల అంగడి అమెరికా అనడం వస్తువినిమయ ప్రపంచాన్ని ఆవిష్కరింప చేసింది.అమెరికాలో పల్లీలు కొనాలంటే ఒక్కడాలరే అని ఎవరైనా అంటే,ఒక్క డాలరా! యాభైరూపాయలా!అంటూ పావలాకు కొనుక్కున్న రోజులు గుర్తుకొచ్చి గుండెలు బాదుకుంటాం.
అమెరికా భూతలస్వర్గంకాదు,బెడ్ ఆఫ్ రోజెస్ అంతకన్నాకాదు అని చెప్తూనే మనవాళ్లు అమెరికాలో కష్టపడి సుఖాన్ని అనుభవిస్తున్నారంటారు.ఇక్కడ కులాల కురుక్షేత్రమయితే అక్కడ జాతుల జాత్యంహంకారమంటారు.ఎండకాలం మండే కొండలున్న కాలిఫోర్నియాను కాలే ఫోర్నియా అంటారు.ఇలా ఒకటా రెండా ఎన్నోపదాల విరుపులు,మెరుపులు నానీలను చమత్కృతులతో తాపడం పెట్టి మనసును గిలిగింతలు పెట్తాయి.అమెరికాను అలా చూసి,ఇలా మరచిపోక తన మనసున ముద్రితమైన భావాలను వెంట తోడ్కొని వచ్చి చదివినంతనే నాలుకపై స్థిరపడిపోయే వేమన పద్యాల్లా నానీలను రూపకల్పన చేయడం అభినందనీయం.
ప్రతులకు,
1)నవోదయా బుక్ హౌస్
కాచిగూడ,హైదరాబాద్-27
2)ఆంధ్ర సారస్వత పరిషత్
తిలక్ రోడ్,హైదరాబాద్-1
3)ప్రమీల ప్రచురణలు,
శ్రేష్టారామం
9-76/2,ఉదయనగర్ కాలనీ
బోడుప్పల్
హైదరాబాద్-500 039
ఫోన్:040-27201007
Saturday, March 17, 2012
మనసుభాష
17-3-2012,ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురింపబడిన నా వ్యాసం.
http://www.andhrabhoomi.net/content/batuku-basha-kadu
బతుకు భాష కాదు.. మనసు భాష కావాలి
తెలుగు చదవడం రానివాళ్లున్నారు, తెలుగు రాయలేని వాళ్లున్నారు, తెలుగు మాట్లాడటం రానివారున్నారు. వారు కన్నడిగులు, తమిళులు, బెంగాలీలు, పంజాబీలు, కేరళీయులు అనుకుంటున్నారు కదూ! కాదు... అరె! వీరికి కూడా తెలుగు వచ్చు, మాటలాడటం చూసామే అంటారు. అయితే తెలుగువారయి కూడా తెలుగు మాటలాడటం రానివారు, మాటలాడటానికి ప్రయత్నించనివారు, మాట్లాడాలంటే సిగ్గుపడేవారు ఉన్నారు.
ఇక మాట్లాడినా పట్టి పట్టి మాట్లాడుతారు. అసలు వీరు మాట్లాడేది తెలుగేనా అని సందేహం కలుగుతుంది. మన మాతృభాషకు ఎందుకీ వేదన అని బాధ కలుగుతుంది. చెక్కుమీద తెలుగులో సంతకం చేసినందుకు తనకు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడం తెలుసుకున్న భోగరాజు పట్ట్భారామయ్యగారు ఆవేశపూరితులయ్యారు. దాని ఫలితమే ఆంధ్రా బ్యాంకు అవతరణ! ఏది ఆ స్ఫూర్తి ఈనాడు?
తెలుగు బిడ్డడవయ్యు తెలుగు రాదంచును / సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా? / దేశ భాషలందు తెలుగులెస్స యటంచు / తెలుగు బిడ్డా / యెపుడు తెలుసుకుందువురా? అని ప్రజాకవి కాళోజీగారు అన్నమాటలు చురుక్కుమనిపించక మానవు.
ఆంగ్ల భాషను నేర్చుకుని తద్వారా ఉద్యోగ అర్హతలను పెంపొందించుకోవద్దని ఎవరూ అనరు. బ్రతుకు భాషకు మనసు భాషకు ఉన్న అంతరం తెలుసుకోవాలి. తెలుగుపై ఆదరణ పెంచుకుని, తెలుగులో ఇంటా బయటా సంభాషిస్తూ భాషా పాటవాన్ని పెంచే సాహిత్య పఠనాన్ని ప్రోత్సహిస్తూ నవతరాన్ని తెలుగు బాటలో నడపాలి.
తెలుగు భాష బలంగా వేళ్లూనాలంటే భాషాప్రియత్వ ప్రకటనలో ఒరవడి మారాలి. మాతృమూర్తిపై మమత, మమకారం, స్వతస్సిద్ధం. మరి మాతృభాషపై ఉదాసీనత ఎందుకు? ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఆంగ్ల భాషను ప్రాథమిక స్థాయి నుండి ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. పిల్లల సామర్థ్యం పెంచే దిశగా విద్యావిధానాలు రూపుదిద్దుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనా తెలుగును విస్మరించి చిన్నచూపుచూడరాదన్న అభిప్రాయం బలంగా వినిపించింది. ఆంగ్లం మాధ్యమంగాకల విద్యా సంస్థలలో తెలుగులో మాట్లాడితే శిక్షింపబడుతున్న చిన్నారుల అవస్థలు చూస్తే పిల్లలకు కాకుండా ముందు వారిని శిక్షించినవారికి పాఠాలు నేర్పవలసిన అవసరముందేమోననిపిస్తుంది.
తెలుగు మనసు భాష. మన మనసులోని భావాలను పరభాషలలో ఎంత సామర్థ్యమున్నా తెలుగులో ప్రకటించినంత స్పష్టంగా ఆలోచనలను అర్థవంతంగా వివరించడం కష్టతరం. తెలుగు జాతీయాలు, నుడికారాలు, పొడుపు కథలు సామెతలతో పరిపుష్టమైన తెలుగు భాష వినసొంపుగా ఉండటమే కాదు భాష పట్ల అభిమానాన్ని పెంచుతుంది. అందుకే చిన్నారులకు కథలు చెప్పేటపుడు కథలో వచ్చిన జాతీయాలు, సామెతలకు అర్థాలు చెప్పి భాష సౌందర్యాన్ని ఇనుమడింపజేయాలి. పిల్లలలో పఠనాసక్తిని పెంపొందించేందుకు కథ రాజమార్గం.
తెలుగుకు పొరుగు రాష్ట్రాలవలెనే మనకూ ప్రత్యేక మంత్రిత్వశాఖ అవసరం ఉందని ఎందరు నొక్కి చెప్పినా కార్యరూపం దాల్చడానికి కాలమెప్పుడు కరుణ చూపుతుందోనని వేచి చూడటమే మనకు మిగిలింది. తెలుగు నేర్చుకుంటే మాకేం లాభం అనేవారికి తెలుగు పరీక్షలో రావలసిన కనీస మార్కులు వారు కోరుకుంటున్న ఉద్యోగానికి అదనపు అర్హత అని నిర్ణయిస్తే ఈ ప్రశ్న వేయరు.
ఆంగ్లం నేర్చుకున్నంత మాత్రాన మాతృభాషను మృతభాషగా మార్చకూడదుకదా! చివరకు పెద్దతెర, చిన్నతెర అని తేడా లేకుండా ఆంగ్ల శీర్షికలకే ప్రాముఖ్యతనిస్తున్నాయి. కడకు వ్యాసాలలోకూడా అసంఖ్యాకమైన ఆంగ్ల పదాలు దొర్లడం తెలియకుండానే జరిగిపోతుంటుంది. అవసరార్థం అరువు తెచ్చుకున్న పరభాష జీవిత నౌకను నడిపిస్తుందనుకుంటున్న నేపథ్యంలో ఆ భాషపై పెల్లుబికిన వ్యామోహ సునామీ ముంచుతుందో లేక చాప క్రింద నీరులా మూలాలను కబళిస్తుందో తెలియక, అచేతనులై నిలబడ్డ భాషాభిమానులను నివ్వెరబోయేటట్లు చేస్తోంది.
- సి.ఉమాదేవి

Friday, March 16, 2012
A letter to Grandma(అమ్మమ్మా,చెప్పవూ!)
స్థూలంగా ఇదీ లేఖ.రాసినప్పుడు పాప వయసు ఏడేండ్లు.తరగతిలో అమ్మమ్మకు లేఖ రాయమంటే రాసినది,అమ్మమ్మకు పోస్టులో అందింది.దేశమేదైనా పసిమనసుల ఆలోచనా ధోరణి ఒకటేనన్నది సుస్పష్టం.I am learning about life long ago in school.Avni, I assume that you were learning how life was?Right!మనిషికి జీవితమే పాఠశాల.పిల్లలకు పాఠశాలే జీవితం.
Did you ever get to see a war going on or was there a war going on in your childhood?
Avni,I am lucky as I was born after independence but I heard many stories about freedom fight.As I grew I read the stories of our great leaders and their struggle of war in a peaceful way.
మీ బాల్యమెలా ఉండేది అని అడిగితే ఒక క్షణం ఆలోచనలో పడ్డాను.
మా బాల్యంలో....
కంప్యూటరు లేదు!సెల్ ఫోను లేదు, అంతెందుకు ల్యాండ్ ఫోనే లేదు!సినిమా...ఊ...ఏడాదికి ఒకటో,రెండో అదే పెద్ద సంబరం.
టి.వి అసలేలేదు. అదేమిటీ....!పిజ్జాలు,బర్గర్లు అంటుంటారే,అవి మేమెరుగము.
మాకు అందుబాటులోనున్నవి మీకు ఏమీలేవా...అయ్యో పాపం!
I thought she took pity on me but I felt sad after I heard that she is missing what we had in our childhood.
నేటి బాలబాలికలు కోల్పోతున్న బంగారుక్షణాలెన్నో!ఎన్నెన్నో!
అమ్మమ్మ,నానమ్మల కథల జోలలు,తాతయ్యల ముద్దు మురిపాలు,నిత్యం కళ్లల్లో కనిపెట్టుకునే అమ్మనాన్నలు, వెన్నెలకుప్ప,కుచ్చుకుచ్చు పుల్ల,వామనగుంటలు,బంధాల బంధనాలు,ఉమ్మడి పండుగలు,స్వచ్ఛమైన నేతివంటలు,ఉత్తరాల ఊసులు,పుస్తకాల రాశులు!ఆకాశవాణిలో సంక్షిప్త శబ్దచిత్రాలు,మాటలు,పాటలు,నాటికలు కలగలిసిన బాలానందం!జయజయ ప్రియ భారత జనయిత్రి ...నేర్చుకున్న పాట ఇప్పటికీ చెవులలో మ్రోగుతోంది.
In India were schools strict?
అమ్మో!చూచివ్రాత గుండ్రంగా లేకపోతే అరచెయ్యి ఎర్రగా కందిపోయేది గోరింటాకు పండినట్లు!అందుకే ఇంత గుండ్రంగా!!!హమ్మ్!టైపు చేస్తున్నాను కదూ!సారీ!
బడిలో టీచర్లు కొట్టేవారు పేము(ప్రేమ) బెత్తంతో,ఆప్యాయంగా పిలిచి మిఠాయిలు పెట్టి మంచి మాటలతో బుద్ధిని వికసింపచేసేవారు.కొట్టినప్పుడు కాదు,మాక్కాస్త బుద్ధివచ్చాక!టీచరు దెబ్బకు,అమ్మ దెబ్బకు ఆనాడు తేడా లేదు.
జ్ఞాపకాల తుట్టె కదిపితే చాలు మనసు చెమ్మగిలుతుంది,కళ్లు తడుస్తాయి.
కథల,వ్యాసాల మధ్య అనుకోకుండా కనబడిన అవని లేఖ ఈ పోస్టుకు కారణమైంది.
Sunday, March 11, 2012
కవితా చినుకులు
కన్నీటి చినుకై తడిపే కవిత్వం
చినుకు రాలకముందు మేఘాలు ముసురుకుంటాయి.కవిత జాలువారక ముందు ఆలోచనలు ముసురుకుంటాయి.అయితే గాలితాకిడికి మేఘాలు చెల్లచెదురై చినుకును నిలవరించినా బిక్కి కృష్ణగారి కవితలు మాత్రం చినుకుల్లాకాక వడగండ్లై రైతుల కన్నీటి కడగండ్లను కురిపిస్తాయి.
కవితా దాహార్తిలో దీనులకు,రైతులకు వస్తు ప్రాధాన్యతనొసగినా అనుబంధాలకు, మానవత్వానికి కూడా దిశానిర్దేశం చేయగల కవితలెన్నో చినుకులో ఒదిగున్నాయి.వీరి కవితలు ఊహలలోని పదముద్రలు కావు.అవి బలమైన పాదముద్రలు.అతి సాధారణ అంశమైనా చినుకు కవితలలో తన గొంతును బలంగా వినిపిస్తుంది.కవితలు కలలనుకాక జీవితపార్శ్వాలను గోచరింపచేస్తాయి. చినుకురాలక మేఘాలరాకకై తరచిచూచే రైతన్న ఎదురు చూపుల ముఖచిత్రం ద్వారా కవితా సంపుటిలోని కవితాత్మ ఒక్క చూపుతోనే విదితమవడం అభినందనీయం.
కవితలన్నిటా పరచుకున్న ఆర్ద్రత,ఆత్మీయత,మానవీయత మనిషిని మానవత్వమై పుష్పించమంటుంది. మనిషి మనవలసిన విధమేమిటో చెప్తూ మనిషిని పచ్చని నోటుగాకాక పచ్చని చెట్టులా పరిమళించాలంటారు కవి.మానవతా విలువలు మార్కెట్లో సరుకులై మనిషి డబ్బువాసన వేస్తున్నాడనడం చేదుమాత్రే కాని పచ్చి నిజం.ప్రపంచీకరణ దిశగా అడుగులుపడినప్పుడు ఏమి కోల్పోతున్నామో గమనించాలంటూ హెచ్చరిస్తారు.
భారతదేశం పటంపై చెదిరిన అక్షాంశాలు బాలకార్మికులు అనడం గుండెను పిండే వాక్యమే!భారతదేశం వెలిగిపోతోంది అని అంటున్నాం కాని బాలకార్మికుల బ్రతుకులు చీకటిలోనే ఛిద్రమవుతున్నాయని ఒప్పుకోక తప్పదు.వారి కవితలో మెదడు చెట్టై,ఆలోచన పువ్వై,అనుభవాలు పండ్లవడం ప్రకృతిలో మమేకమవడమే.
నిరుద్యోగం ఎయిడ్స్ కన్నా భయంకరమైనది అంటుంది ఆశల చెట్టు.ప్రకృతిపై ప్రేమ,చెట్లపై మమకారం మెండుగాగల కవితలన్నిటిలోను చెట్లు కూలుతున్న దృశ్యం బాధాకరంగా కవిత్వీకరించబడింది. మనిషిపై పగ చెట్టుపై గొడ్డలివేటు.కాండం నేలకొరగడమంటే మొత్తం కుటుంబం కుప్పకూలడమే.ఇక్కడ చెట్టుపై ఆధారపడ్డవారే కాదు చెట్టుపై నివసించే జీవజాలం కూడా కుటుంబమే.
బాల్యం అందరి హృదయాలలోను ఓ వెచ్చని జ్ఞాపకం.బాల్యంగురించి చెప్తూ,బాల్య గాఢానుభూతులు పరిమళించే పూలతోట/మధురానుభూతులు పంచాల్సిన మనసు /మంచులా గడ్డకట్టుకు పోయింది అని మనసుకు అంటిన స్థబ్దత గురించి వాపోతారు.వీరి కవితావస్తువు ఊహాజనితంకాక నిత్యవేదనలనుండి పుట్టిన ఆవేదనా చినుకు.
ఈ కవితా సంపుటికి తన తొలిపలుకుగా కృష్ణగారు తన ఆలోచనలను,తన అంతరంగాన అలజడి సృష్టించిన చింతనలను స్పష్టంగా తెలిపారు.కవితలలో వైవిధ్యమున్నా ఒకచోట కూర్చిన కదంబమాలలా చినుకు కవితాసంపుటి జీవితంలోని అన్నిరంగులను ఆవిష్కరించింది.అలా చూసి ఇలా మరచిపోయే సమకాలీన సంఘటనలలోని లోతులను స్పృశించడం కవులకే చెల్లు.చినుకులా మొదలైన వీరి కవితాచినుకులు సమాజరుగ్మతలను ప్రక్షాళన చేసేందుకు జడివానై కురిసాయి.
Saturday, March 10, 2012
పూలు మాట్లాడుతాయి!
చామంతీ ఏమిటే ఈ వింత?
రోజ్ రోజ్ రోజా పువ్వా..పువ్వా పువ్వా!
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
ముత్యమంత పసుపు!
నా చిన్ని రోజావే!
అందానికి అందం నేనే!
ఒక కొమ్మకు పూచిన పువ్వులం!
ఓహో గులాబి బాల!
పూలు గుసగుసలాడేనని
పూలు మాట్లాడుతాయి.ఔను,నిజమే!అనునిత్యం నన్ను ఆత్మీయంగా పలకరించే మా తోటలోని పూలు బ్లాగ్మిత్రులందరిని అలరించాలని ఈ పూల ఊసులు.

Thursday, March 8, 2012
హోలి శుభాకాంక్షలు
Subscribe to:
Posts (Atom)